ఆక్స్‌ఫర్డ్– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రెజిల్, స్కాట్‌లాండ్‌లో సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించామని, దీన్ని ఇచ్చిన వారికి బూస్టర్ డోసులివ్వడం ద్వారా రక్షణ పెంచాలని సూచించింది.
ఈ టీకా కోవిషీల్డ్ పేరిట ఇండియాలో గుర్తింపు పొందింది. వేరియంట్‌ను బట్టి టీకా రక్షణ తగ్గడం ఆధారపడి ఉందని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధన బూస్టర్ డోసుల ప్రాముఖ్యాన్ని వివరిస్తోందని ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ విఠల్ కటికిరెడ్డి చెప్పారు. రక్షణ తగ్గుతోందని తెలియగానే భారత ప్రభుత్వం బూస్టర్ డోసులివ్వడం ఆరంభించాలన్నారు.