ఇంటిని నాశనం చేసిన ఆవులు

ఇంటిని నాశనం చేసిన ఆవులు

రెండు పెంపుడు ఆవులు ఓ మహిళకు షాక్‌ ఇచ్చాయి. బయటకెళ్లి తిరిగొచ్చేలోపు ఇంటిని బందెల దొడ్డి చేసేశాయి. ఫ్లోర్‌ మీద మల, మూత్ర విసర్జన చేసి, కుర్చీలు ఇతర సామాగ్రి విరగొట్టి నానా బీభత్సం సృష్టించాయి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని థస్‌మేనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థస్‌మేనియాకు చెందిన చెల్సియా హింగ్టన్‌ కొద్దిరోజుల క్రితం కూతుర్ని ప్లే గ్రూప్‌( ప్లే స్కూల్‌)లో విడిచిపెట్టడానికి వెళ్లింది. ఓ గంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండటం చూసి ఖంగారు పడి ఇంట్లోకి వెళ్లింది.

అంతే! అక్కడి దృశ్యాలు చూసి షాక్‌ అయింది. పెంపుడు ఆవులు బాండిట్‌, ఎస్‌ఓబీలు ఇంట్లో నానాబీభత్సం సృష్టించాయి.కుర్చీలు, పూల కుండీలు ధ్వంసం చేశాయి. బట్టలు, బ్లాంకెట్లు, పుస్తకాలు బొమ్మలు, పేపర్లు, ఫైల్స్‌ పాడు చేశాయి. కార్పెట్‌ను పెండతో నింపేశాయి. ఆమె వచ్చే సమయానికి సంఘటనా స్థలంలో హాయిగా తిరుగుతున్నాయి. దీనిపై హింగ్టన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను భయకంపితురాలినయ్యా.. అక్కడి దృశ్యాలను నమ్మలేకపోయా. ఇంటి బయటున్న పశువుల పాక డోర్‌ లాక్‌ పాడవటంతో అవి బయటకు వచ్చేశాయి. ఇంటి వెనకాలి తలుపులనుంచి లోపలికి ప్రవేశించి నాశనం చేశాయి’’ అని వాపోయింది.