మహారాష్ట్రలోని బాణాసంచా కర్మాగారంలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకా దేహనే గ్రామం విశాల్ ఫైర్ వర్క్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తర్వాత పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించగా.. దీనికి ధాటికి 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని భూమి కంపించింది. శబ్దాలు 20 కిలోమీటర్ల వరకూ వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత భారీ శబ్దాలు రావడంతో ఇళ్లల్లోని నుంచి జనం పరుగులు తీశారు.
కర్మాగారం చుట్టుపక్క ప్రాంతాల్లోని ఇళ్లు పేలుడు ధాటికి కంపించడంతో భూకంపం వచ్చిందేమోనని భయం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లోపల చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు అక్కడకు హుటాహుటీన చేరుకున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంలో కనీసం పది మంది గాయపడినట్టు తెలుస్తోంది. వీరిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు అధికారులు తరలించారు. లోపలి చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తేవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. లోపల ఎంత మంది కార్మికులు ఉన్నారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలోనే అడవి ఉండటంతో మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టారు.