టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం కన్నుముశారు.ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న భువీ తండ్రి ఇంటికి తిరిగివచ్చారు.
కాగా కిరణ్ పాల్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడినుంచి ముజఫర్‌నగర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి షిప్ట్ చేయగా.. చికిత్స తీసుకుంటూ నేడు సాయంత్రం మృతి చెందారు. కిరణ్ పాల్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తించారు. ఆరోగ్య కారణాల రిత్యా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన అప్పటినుంచి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నారు.
ఇక భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున పాల్గొన్నాడు. కరోనా మహమ్మారి సెగ ఐపీఎల్‌కు కూడా తగలడంతో బీసీసీఐ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంటికి చేరుకున్న భువీ తన తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. కాగా గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న భువీ మునుపటి ఫామ్‌ను ప్రదర్శించలేకపోతున్నాడు.
ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఊదు టెస్టుల సిరీస్‌కు భువీని ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల ఆటపై దృష్టి పెట్టేందుకు భువీ కావాలనే టెస్టులకు దూరమయ్యాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. కానీ తనపై వచ్చిన రూమర్లను భువీ కొట్టిపారేస్తూ తాను అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. టీమిండియా తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు.