భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న చేతన్ చౌహాన్ కరోనా వైరస్‌తో ఆదివారం మృతి చెందారు. 73 ఏళ్ల చేతన్ చౌహాన్ కోవిడ్–19 పాజిటివ్‌తో జూలై 12న లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కిడ్నీ సంబంధిత సమస్యలతో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
ఆయన కోలుకుంటున్నట్లు కనిపించినా శుక్రవారం రాత్రి హఠాత్తుగా ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. చేతన్ చౌహాన్‌కు భార్య, కుమారుడు ఉన్నాడు. కుమారుడు వినాయక్ మెల్బోర్న్ నుంచి రావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ చౌహాన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 అర్ధ సెంచరీల సహాయంతో 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగిన ఆయన 153 పరుగులు సాధించారు.