నా జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా

నా జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా

కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో కరోనా మహమ్మారికి బలవుతూ వస్తున్నారు. ఈ మహమ్మారి పలువురు క్రికెటర్ల ఇళ్లలో విషాదాలు నింపుతూ వస్తుంది. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు పియూష్‌ చావ్లా, ఆర్పీ సింగ్‌ కరోనా కారణంగా తమ తండ్రులను కోల్పోగా.. టీమిండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో సోదరిని, తల్లిని కోల్పోయింది. తాజాగా మరో టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలైపోయారు.

ఈ విషయాన్ని పూనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో పంచుకుంది. ” నా జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా. మనకు ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఈరోజు తెలిసింది. లవ్‌ యూ మామ్‌.. నువ్వు నా గైడింగ్‌ స్టార్‌… నేను తీసుకునే ప్రతి స్టెప్‌ వెనుక నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు మమ్మల్ని భౌతికంగా విడిచిపెట్టి వెళ్లావంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నువ్వు లేవన్న నిజాన్ని ఒప్పుకొని ముందుకు సాగాల్సిందే. నీతో గడిపిన క్షణాలు ఒక జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి.

రెస్ట్‌ ఇన్‌ పీస్‌.. మామ్‌. ఇది చాలా డేంజరస్‌ వైరస్‌. దయచేసి అందరు ఇంట్లోనే ఉంటూ బౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండండి” అంటూ రాసుకొచ్చింది. దీంతో పాటు తన తల్లితో, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. 2019లో టీమిండియాకు అరంగేట్రం చేసిన ప్రియా పూనియా ఇప్పటివరకు 7 వన్డేలు.. మూడు టీ20లు ఆడింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పూనియా ఎంపికైంది.