జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రహానే

జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రహానే

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుత్ను ఢిల్లీ టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది. బ్యాటింగ్‌లో ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉండడం.. రబడ లాంటి స్టార్‌ పేసర్‌ భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసివచ్చింది. ఢిల్లీకి తుది జట్టు మాత్రమే కాకుండా బెంచ్‌ బలం కూడా గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఢిల్లీ బ్యాటింగ్‌ లైనఫ్‌ బలంగా ఉండడంతో ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అందులో అజింక్యా రహానే కూడా ఉన్నాడు.

స్వతహాగా మంచి టెక్నిక్‌ కలిగిన రహానే ముంబైతో మ్యాచ్‌ వరకు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అది కూడా రిషబ్‌ పంత్‌ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. అయితే ముంబైతో మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచినా.. అతని ఆడిన షాట్స్‌ కచ్చితమైన టైమింగ్‌తో ఉండడం విశేషం. అయితే రహానేకు ఇది నిజంగా మంచి అవకాశమని టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అంటున్నాడు.

‘ పంత్‌ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన రహానే చేసింది 15 పరుగులే అయినా.. మంచి ఈజ్‌తో కనిపించాడు. పంత్‌ తొడ కండరాల గాయంతో 7 నుంచి 10 రోజులు టోర్నీకి దూరంగా ఉండనున్నాడు. ఆలోగా ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఇది రహానేకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. పంత్‌ వికెట్‌ కీపర్‌ కావడంతో అతని స్థానంలో వికెట్‌ కీపింగ్‌ తెలిసిన విదేశీ లేదా స్వదేశీ ఆటగాడు జట్టులో ఉండాల్సిన అవసరం ఉంది. హెట్‌మైర్‌ లేదా అలెక్స్‌ క్యారీల్లో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉంటారు. ఒకవేళ నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రహానే మంచి ప్రదర్శన కనబరిస్తే మాత్రం ఢిల్లీ బెంచ్‌ కూడా బలంగా ఉన్నట్లే. ఇక ఢిల్లీలో అనూహ్యంగా ఎవరైనా ఆటగాడు గాయపడినా.. అంత ఇబ్బంది ఉండదు.

రహానే రాణిస్తే మాత్రం ఢిల్లీకి బ్యాటింగ్‌ కూర్పు పెద్ద తలనొప్పిగా మారనుంది. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌లో రాబిన్‌ ఊతప్పను ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుంది. రాబిన్‌ ఊతప్ప ఓపెనర్‌గా రాణిస్తాడనే నమ్మకం నాకుంది. బెన్‌స్టోక్స్‌ సూపర్‌ ఆటగాడు.. అందులో సందేహం లేదు. ఒకవేళ ఢిల్లీ మొదట బ్యాటింగ్‌ చేసి 200 పైగా స్కోరు సాధిస్తే ఆర్‌ఆర్‌ స్టోక్స్‌ను ఓపెనర్‌గా పంపొచ్చు.. ఒకవేళ సాధారణ స్కోర్‌ అయితే మాత్రం రాబిన్‌ ఊతప్పను ఓపెనింగ్‌లో పంపించడం వల్ల ఆ జట్టుకు ఏదైనా లాభం ఉండే అవకాశం ఉంటుంది’ అని ఓజా చెప్పుకొచ్చాడు.