మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని 14 ఏళ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వలో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని శోలాపుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు విజయ్ బట్టు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి కుమారుడు విశాల్ దగ్గర్లోని పాఠశాలలో చదువుకొనేవాడు. రోజూ స్కూలుకు ఫోను తీసుకువెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. ఈ విషయమై ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. విసుగెత్తిపోయిన విజయ్ కుమారుడి ఆహారంలో విషం కలిపాడు. ఈ సంగతి అతడి భార్యకు తెలియదు. కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న దంపతులిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయ్ ఇంటికి దగ్గర్లోని మురికికాల్వలో మృతదేహం కనిపించింది.
దొరికిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్.. జరిగిన విషయాన్ని జనవరి 28న తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత పోలీస్స్టేషనుకు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. హత్య కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుణ్ని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.