గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన లక్ష్మీ నారాయణ, జీవిత దంపతుల పెద్ద కుమార్తె సృజన కరీంనగర్ జిల్లా నగునూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బుధవారం రాత్రి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. హతాశులైన వారు గురువారం ఉదయం కళాశాల వద్దకు చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి బావురుమన్నారు. ‘ఆదివారం ఇంటికి వస్తానంటూ బుధవారమే మా అమ్మాయి ఫోన్ చేసింది. తీసుకెళ్లేందుకు రావాలని కోరింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకునేంత ఆపద ఏమొచ్చిందో అర్థం కావడం లేదని మృతురాలి తల్లి సహా కుటుంబ సభ్యులు కన్నటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి లక్ష్మీనారాయణ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు.
మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్య ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ‘‘రోజువారీగానే సృజన బుధవారం సాయంత్రం స్నేహితులందరితో కలిసి భోజనం చేసింది. తర్వాత అందరూ తరగతి గదిలో రాత్రి 11 గంటల వరకు చదువుకున్నారు. అనంతరం నాలుగో అంతస్తులోని గదిలోకి వెళ్లి నిద్రించారు. అందరూ నిద్రలో ఉండగా సృజన కింద ఉన్న తరగతి గదిలోకి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు చదువుకోవడానికి తరగతి గదికి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి అధ్యాపకురాలికి సమాచారం ఇచ్చారు’ అని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. ఇదిలా ఉండగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఎస్పీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.