మధ్యప్రదేశ్లోని రాయిసేన్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 11 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి స్థానిక జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా.. అటువైపుగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని బలంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ రహదారి భద్రత సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.