కృష్ణాజిల్లా బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) కుమారుడు కృష్ణమూర్తి (కిట్టు) అనుచరులు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీ చించేశాడని ఆరోపిస్తూ తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి రెండు కార్లు, ఏడు బైక్లపై వచ్చిన దాదాపు 20 మంది ఇంట్లో ఉన్న తెదేపా సానుభూతిపరుడు ఈడే యశ్వంత్ను బయటకు పిలిచి దాడి చేశారు.
అక్కడితో ఆగకుండా బలవంతంగా కారులో ఎక్కించుకుని అర్ధరాత్రి వరకూ ఎక్కడెక్కడో తిప్పి తీవ్ర హెచ్చరికలు చేసి పోలీసుస్టేషన్ వద్ద విడిచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యు లు, తెదేపా, జనసేన నాయకులు పోలీసుస్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు బాధితుడిని చికిత్స కోసం సర్వజనాసుపత్రికి తరలించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధిత యువకుడు యశ్వంత్ కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. కిట్టు ప్రధాన అనుచరుడిగా వైకాపా సోషల్ మీడియా వ్యవహారాలు చూసే.. గ్రామానికే చెందిన పవన్ బయట వ్యక్తులను పిలిపించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.