ఉన్నత చదువు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ దివ్యాంగురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. జరుగుమల్లి మండలం ఎడ్లూరిపాడు ఎస్సీ కాలనీకి చెందిన పోకూరి రామయ్య కుమార్తె కుసుమ(30) పీజీ పూర్తిచేశారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలని.. కుసుమ కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే సింగరాయకొండ రైల్వే స్టేషన్‌కు చేరుకొని గూడ్సు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒంగోలు జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.