హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.
నేడు రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. హరియాణా విద్యా శాఖ మంత్రి సీమాట్రిఖా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ 2018లోనే గడువు ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.