రెండు వేర్వేరు మతాలకు చెందిన స్త్రీ పురుషులు పక్క పక్కన కూర్చున్నారన్న కారణంలో ఓ అల్లరిమూక రెచ్చి పోయింది. వారిపై రాడ్డులతో దాడి చేసి హింసించింది. కర్ణాటకలోని బెళగావిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితులిద్దరూ ఓ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసేందుకు వచ్చారు. బెళగావిలోని ఓ సరస్సు ఒడ్డున కూర్చున్నారు. అది గమనించిన దాదాపు 17 మంది అక్కడికి వచ్చి .. ఇక్కడేం పని అని వారిని ప్రశ్నించారు. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారని తెలుసుకొని వారిపై భౌతిక దాడికి దిగారు. వారి బంధువులు వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు.
‘‘సరస్సు ఒడ్డున ఉన్న మా దగ్గరి వచ్చిన 17 మంది మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె వరుసకు సోదరి అవుతుందని చెబుతున్నా వినిపించుకోలేదు. ఓ గదిలోకి తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆమె నా పినతల్లి కూతురని చెప్పి నా వినలేదు. వేర్వేరు మతాలకు చెందిన వారు అన్నా చెల్లెళ్లు ఎలా అవుతారంటూ నీచంగా మాట్లాడారు. ఆమె తండ్రి వేరే మతానికి చెందినవారు కావడంతో.. దానిని ఆచరిస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. మా ఇద్దరి మొబైల్స్ ను తీసుకున్నారు. రూ.7 వేల నగదు ఉంటే దానిని కూడా లాక్కున్నారు’’ అని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.