Crime: అధిక వడ్డీ ఆశచూపి.. భారీ మోసం..

Crime: Ketugadu stole Rs. 2.71 crores believing that he would get married
Crime: Ketugadu stole Rs. 2.71 crores believing that he would get married

తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. రూ.కోట్లలో డబ్బు సమకూర్చుకొని ఉడాయించడంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని విమల నివాస్లో ఏడాది కాలంగా స్థిరాస్తి సంస్థగా చెబుతూ ‘జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ పేరుతో వేలూరి లక్ష్మీ నారాయణ (ఎండీ), వేలూరి జ్యోతి (సీఎండీ) దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థను గతంలో బోడుప్పల్, మేడిపల్లిల్లో నడిపించి అక్కడి నుంచి ఉప్పల్కు మార్చారు. రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. రూ.10 లక్షలు పెడితే ప్రతి 15 రోజులకు రూ.20 వేల వడ్డీతో పాటు అసలు రూ.లక్ష చొప్పున ఇస్తామని వినియోగదారులను నమ్మించారు. పెట్టుబడి పెట్టినవారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరిట వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారు.

వీటితో పాటు కొత్త సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలోనే కమీషన్లు ఇస్తామని నమ్మ బలికారు. ఈ క్రమంలో వేల మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా రూ.18 లక్షలు పెట్టారు. ఏజెంట్గా కూడా చేరారు. ఈవిధంగా 500 మందికి పైగా ఏజెంట్లు తయారై.. వేల మందిని స్కీముల్లో చేర్పించారు. కొంతకాలం .. చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో మరింత మంది ఆకర్షితులయ్యారు. అయితే గత నెల రోజులుగా ఈ సంస్థ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. ఫోన్లు చేసినా నిర్వాహకులైన జ్యోతి, లక్ష్మీనారాయణ స్పందించడం లేదు. అనుమానం వచ్చిన కొందరు ఆ సంస్థ ఆఫీస్కు వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో బాధితులు 10 మంది ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము రూ.2.50 కోట్లు మోసపోయినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల సంఖ్య వేలలోనూ, మోసపోయిన సొమ్ము రూ.కోట్లలోనూ ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.