అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు ఢీ కొన్న ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ గ్రామంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన ట్రక్కు బొగ్గు లోడుతో వెళ్తున్నట్లు సమాచారం. 30 మంది క్షతగాత్రులు జొర్హాట్ బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అని గోలాఘాట్ జిల్లా ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో ఆరా తీస్తున్నట్లు చెప్పారు.