వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతలో కలహాలు వారి కాపురంలో చిచ్చు రేపాయి. లీపు సంవత్సరం కావడంతో నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29న వచ్చిన వివాహ రెండో వార్షికోత్సవం రోజునే భార్యను కత్తితో నరికి చంపేశాడు. కాకినాడ ఒకటో పట్టణ సీఐ వి.సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు, దివ్య ఎనిమిదేళ్ల క్రితం 2016, ఫిబ్రవరి 29న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, బాబు సంతానం. నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి రెండు, మూడురోజులు ఉండి వస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య బుధవారం రాత్రి వాగ్వాదం జరగ్గా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి సర్ది చెప్పారు.
గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. వారి ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించినా.. రోజూ మాదిరిగానే సాధారణ గొడవే అనుకుని సమీపంలో ఉన్న స్థానికులు, బంధువులు పట్టించుకోలేదు. కొద్ది సేపటికి ఇంట్లో నుంచి దివ్య బయటకు రాగా, అప్పటికే సిద్ధంగా ఉంచిన కత్తిని తీసుకుని వీధిలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన మృతురాలి తోడికోడలు తల్లి లక్ష్మిపై సైతం కత్తితో దాడి చేయగా ఆమె చేతి వేలికి గాయాలయ్యాయి. అడ్డొస్తే నిన్నూ చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో ఆమె పక్కకు వెళ్లిపోయారు. సీఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు.