నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఆరుగురు ఇంటర్ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో డిగ్రీ విద్యార్థి వెంకట్ (19) స్టడీ అవర్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఆదివారం రాత్రి పలువురు ఇంటర్ విద్యా ర్థులు చదువుకోకుండా మాట్లాడుతున్నారు. పరీక్షలు ఉన్నాయని.. మాట్లాడకుండా చదువుకోవాలని అతడు వారికి సూచించాడు. ఇది నచ్చని ఆరుగురు విద్యార్థులు రాత్రి గదిలో నిద్రపోతున్న వెంకట్‌పై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గదిలో నుంచి శబ్దాలు రావడంతో వసతి గృహంలోని మిగతా విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.