Crime: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2.71 కోట్లు స్వాహ చేసిన కేటుగాడు

Crime: Ketugadu stole Rs. 2.71 crores believing that he would get married
Crime: Ketugadu stole Rs. 2.71 crores believing that he would get married

ఓ మ్యాట్రిమోనీలో యువతిని పరిచయం చేసుకున్న కేటుగాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2.71 కోట్లు కొట్టేశాడు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోసాలకు పాల్పడిన నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కొత్తపల్లి నర్సింహ, సైబర్క్రైమ్ ఏసీపీ రవీందర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ రేసులకు, బెట్టింగ్ లకు అలవాటుపడి డబ్బుల్లేక అడ్డదారులు తొక్కాడు. ఓ మ్యాట్రిమోనీలో సభ్యత్వం తీసుకుని నకిలీ పేర్లతో యువతులకు వివాహ రిక్వెస్ట్లు పంపాడు. దాదాపు ఆరుగురు అతని రిక్వెస్ట్లు అంగీకరించారు. వారి ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుతూ నమ్మినట్లు భావించగానే మోసం మొదలుపెట్టేవాడు. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని, భాగస్వామి వీసా రావాలంటే సిబిల్ స్కోరు ఎక్కువ ఉండాలని చెప్పివారు రుణాలు తీసుకునేలా చేసి ఆ డబ్బును తన ఖాతాలోకి మళ్లించుకుంటున్నాడు.

వంశీకృష్ణ.. రిషికుమార్ పేరుతో హైదరాబాద్లోని మదీనాగూడకు చెందిన యువతిని సంప్రదించాడు. తాను అమెరికాలో గ్లెన్మార్క్ ఫార్మాలో సహాయ డైరెక్టర్గా పనిచేస్తున్నానని వివాహం చేసుకుంటానని చెప్పాడు. వివాహం తర్వాత అమెరికాకు తనతోపాటు రావాలంటే భాగస్వామి వీసా కోసం సిబిల్ స్కోరు 845 కంటే ఎక్కువ ఉండాలని చెప్పాడు. ఆమె సిబిల్ స్కోరు 743 ఉంది. ఇది పెరగాలంటే గ్లెన్మార్క్ కంపెనీ రుణాలు ఇస్తుందని చెప్పాడు. యువతి నమ్మగానే ఆమెతో క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, కారు రుణం తీయించాడు. ఆమెతోపాటు వరుసకు సోదరి అయ్యే యువతిని నమ్మించి రుణాలు తీసుకునేలా చేశాడు. ఆ మొత్తాలను త్వరలోనే తిరిగి చెల్లిద్దామని వాగ్దానం చేశాడు. ఆ డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించాడు. ఇలా ఇద్దరి దగ్గర కలిపి రూ.2.71 కోట్లు కొట్టేశాడు. తర్వాత అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో సైబర్క్రైమ్ ఇన్స్పె క్టర్ ఎస్.రమేశ్ బృందం నిందితుడిని అరెస్టు చేసింది. నిందితుడిపై తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 7, ఏపీ, తమిళనాడులో ఒక్కోటి చొప్పున కేసులున్నాయి.