అధిక జీతంతో కూడిన ఉద్యోగమని ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా వెళ్లిన హైదరాబాద్ నివాసి మహ్మద్ అస్ఫాన్ ఉక్రెయిన్ యుద్ధంలో మృత్యువాత పడ్డాడు. మహ్మద్ అస్ఫాన్తో పాటు మరికొంత మంది యువకులకు ఎదురవుతున్న కష్టాలను గత నెలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయమై భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశం కర్కు లేఖ రాయడంతో పాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాకు వెళ్లిన యువకులను సురక్షితంగా భారతదేశానికి రప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో భారతీయుడు హతమైనట్లు రష్యాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టిందని ఒవైసీ ఒక ప్రకటనలో తెలిపారు. మహ్మద్ అస్ఫాన్ మరణించినట్లు ఆ పోస్ట్లో ధ్రువీకరించిందని పేర్కొన్నారు. తను రష్యాకు వెళ్లి ఏం చేస్తున్నాడో కూడా ప్రస్తావించకపోవడం గమనార్హమన్నారు. అస్ఫాన్ మరణం గురించి తమకు అసదుద్దీన్ ఒవైసీ ద్వారా తెలిసిందని కుటుంబసభ్యులు చెప్పారు.