కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తుండగా.. మరో 97 రోజులపాటు పొడిగించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించి.. అదే నెల 26న నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపగా.. ఏడాదిపాటు అతడు తరగతులకు రాకుండా వేటు వేస్తూ కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది. సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా… తాత్కాలికంగా సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. సైఫ్‌పై ఆరోపణలు వాస్తమేనని న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.