సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ వివిధ మార్గాల్లో జనంపై దాడి చేస్తున్నారు. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. లేదా ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా.. ఇటీవల సంబంధిత బ్యాంకు లోగోను, ఒరిజినల్ వెబ్లింకును పోలి ఉండేలా నకిలీ లింకులను సృష్టించి పంపుతున్నారు. ఇది నిజంగా బ్యాంకు నుంచి వచ్చిందేనని వినియోగదారులు క్లిక్ చేస్తే ఖాతాలోని సొమ్ము పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
ఇలా ఎవరైనా వివరాలు అడిగితే స్పందించవద్దని, సంబంధిత బ్యాంకుకెళ్లి నేరుగా తనిఖీ చేసుకోవాలని రిజర్వు బ్యాంకు తాజాగా సూచనలు జారీ చేసింది. లేదా ఆ బ్యాంకు వెబ్సైట్లో ఉండే కస్టమర్ కేర్ నంబరులో సంప్రదించాలని తెలిపింది. బ్యాంకు అధికారిక వెబ్సైట్లో కూడా కేవైసీని అప్డేట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. వినియోగదారులు తమ నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. గుర్తుతెలియని వ్యక్తులకు కేవైసీ పత్రాలు ఇవ్వకూడదని సూచించింది.