బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు.
హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని, ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికి ఉరేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. సీఐ రాకేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.