సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు అనర్థాలకు దారితీస్తున్నాయనేందుకు ఉదాహరణగా నిలిచే ఉదంతమిది. గుర్తుతెలియని వ్యక్తులు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదగా.. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిందీ దారుణం . నాలుగో ఠాణా ఎస్సై సంజీవ్ కథనం ప్రకారం..నిజామాబాద్ జిల్లాలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లు తిరుగుతున్నారంటూ కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ గ్రామీణ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి రాజు(50) సోమవారం జిల్లా కేంద్రం గాయత్రినగర్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు ప్రశ్నించారు.
సరైన సమాధానం చెప్ప కపోవడంతో తీవ్రంగా కొట్టారు. దాడిలో బాధితుడి చేతులు, కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. అతను ఎవరు? ఇక్కడికి ఎందుకొచ్చాడనే విషయమై పోలీసులు ఖానాపూర్ గ్రామస్థులను ఆరా తీశారు. ‘బాధితుడు అనాథ అని, గ్రామస్థుల పశువులు మేపుతాడని, ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడని, కిడ్నాప్లు చేసే వ్యక్తి కాదని స్థానికులు పేర్కొన్నట్టు’ పోలీసులు వెల్లడించారు. బాధితుడిపై దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.