దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర పెరిగిపోతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా కామాంధులు రేగుతున్నాయి. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకోవాలని హత్యలకు చేసేందుకు వెనకాడటం లేదు. రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. కొందరు యువకులు ప్రేమ పేరుతో యువతులను అతి కిరాతకంగా హతమార్చడంతోపాటు అవసరం తీరాక వారిని చంపేస్తున్నారు. మరికొందరు తమ ప్రేమను తిరస్కరించిన యువతులపై దాడులకు దిగుతున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిన యువతిపై ఓ ప్రమోన్మాది బ్లేడ్ తో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళితే… కరీంనగర్ పట్టణ శివారులోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె ఇంటి ఎదురుగా బొద్దుల సాయి అనే యువకుడు నివసిస్తున్నాడు. అయితే ఎదురుగా ఉన్న యువతిని ఇష్టపడిన సాయి కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఇలాంటివి తనకు ఇష్టం లేదని యువతి ఎంత చెప్పినా వినకుండా ప్రేమను అంగీకరించాలని వెంటపడేవాడు. అయితే నాలుగేళ్లుగా సాయి వేధింపులను భరిస్తున్న యువతి ఇక భరించలేకపోయింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో… పంచాయతీ జరిగినా యువతిపై వేధింపులు ఆగలేదు. ఇన్నాళ్లూ ఆ యువతి పట్టించుకోకపోవడంతో సాయి ఉన్మాదిగా మారిపోయాడు.
తనకు దగ్గని ఆ అమ్మాయిని వేరొకరికి దగ్గకూడదని ప్రాణం తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గురువారం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో యువతి ఒంటరిగా ఉండటాన్ని సాయి గమనించాడు. వెంటనే ఇంట్లోకి చొరబడి యువతిపై దాడి చేసి బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి కేకలు విని చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు చేరుకుని సాయిని అడ్డుకుని యువతి ప్రాణం కాపాడారు. దాడిలో యువతి గాయపడగా, చేయి విరిగింది. దాడి విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని తమ కుమార్తెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు.