అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మంది మహిళలపై ఇద్దరు వ్యక్తులు, వారి మిత్రులు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. రాజస్థాన్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరోహీ మున్సిపల్ ఛైర్పర్సన్ మహేంద్రా మేవాడా, మాజీ మున్సిపల్ కమిషనర్ మహేంద్ర చౌధరి కొలువులు ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించారు. వారికి ఆశ్రయమిచ్చి వసతులు కల్పించారు. మత్తుమందు కలిపిన ఆహారం అందించి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారాలు సాగించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి బయటకు చెప్పకూడదంటూ బెదిరించేవారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ నుంచి రూ.లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. వీరి ఆగడాలను ఎదిరించిన ఓ బాధితురాలు మరికొందరు మహిళల అండతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. తాము చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని పోలీసులు కొట్టిపారేసినట్లు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయంకోసం బాధితులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇద్దరు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.