అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడిలో గ్రామానికి చెందిన తెదేపా సానుభూతిపరులు, దంపతులు ఆంజనేయులు (48), జయమ్మ (44) తీవ్రంగా గాయపడ్డారు. పది రోజుల క్రితం గ్రామానికి వచ్చిన పోలీసులు.. సారా తయారీ, విక్రయాలు సాగిస్తున్న వారిపై దాడులు చేసి అనుమానితులైన వైకాపా సానుభూతిపరులను విచారించారు.
అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబీకులే పోలీసులకు సమాచారం ఇచ్చారన్న అనుమానంతో వైకాపా సానుభూతిపరులైన శ్రీనివాసులు, వెంకటేష్, లక్ష్మీదేవి, నాగమణి కలిసి తమమీద పైపులు, కొడవళ్లతో దాడిచేశారని బాధితులు వాపోయారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమచికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.