శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కూర్మాపు చిన్ని (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న ఆయన రెండు రోజుల కిందట సెలవుపై ఇంటికి బయల్దేరారు. మరో నలుగురితో కలిసి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వరకు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు.
శనివారం ఉదయం ఆమదాలవలసలో దిగి ఆటోలో బయల్దేరుతూ టెక్కలి జగతిమెట్ట వద్దకు తమ్ముడిని పంపించాలని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన కాసేపటికే చిన్ని ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. తమ్ముడు జగతిమెట్ట వద్దే ఉన్నా చిన్ని రాలేదు.
ఎంతకూ రాకపోవడంతో శనివారమంతా చుట్టుపక్కల గ్రామాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆదివారం నందిగాం మండలం దేవుపురం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ మృతదేహం కనిపించడంతో పోలీసులు చిన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మృతదేహం చిన్నిదేనని గుర్తు పట్టారు.