అనుమానంతో భార్య మెడలో కరెంట్ వైర్…షాకిచ్చి చంపి !

current-wire-in-the-wifes-neck-with-suspicion

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో రోజూ మద్యం తాగొచ్చి ఆమెతో గొడవ పెట్టుకునేవాడు. అయినా అనుమానం పెరిగిపోవడంతో నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయిన ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడులో చోటుచేసుకుంది.

మద్దిలకట్ట ఎస్సీ కాలనీకి చెందిన తంగిరాల యోహాన్‌కు తోకపల్లి గ్రామానికి చెందిన శ్రావణి(24)తో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లికి ముందు నుంచే మద్యానికి బానిసైన యోహాన్‌ పెళ్లి అయ్యాక తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. అంతేకాకుండా ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న యోహాన్ భార్య నిద్ర మత్తులోకి జారుకున్న తర్వాత విద్యుత్‌ వైరును ఆమె మెడకు తాకించి కరెంట్ షాక్‌‌కు గురిచేశాడు. దీంతో శ్రావణి అక్కడికక్కడే మరణించింది.

అనంతరం భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యోహాన్ ఇంటి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.