తస్మాత్ జాగ్రత్త: ట్రూకాలర్ తో… సైబర్ దాడి.. 4.75 కోట్ల యూజర్స్ డేటా హ్యాక్..?

నడుస్తోన్న కాలం అత్యాధునిక యుగం. ఈ కాలంలో ప్రతి వ్యక్తీ స్మార్ట్ ఫోన్ లు ఉపయోగించేస్తున్నారు. ఈ స్మార్ట్  వినియోగం పెరిగిన తర్వాత రకరకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క క్లిక్‌తో గేమ్స్, వీడియో కాన్ఫరెన్స్, చాటింగ్స్, మూవీస్, ఇలా ఎన్నో చూడవచ్చు. అలాగే చాలావరకూ సోషల్ యాప్స్ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అయితే కొన్ని యాప్స్‌ నుంచి యూజర్స్ డేటా చోరీ అవుతుండటం నిత్యం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.  గ్లోబలైజేషన్ నేపథ్యంలో డేటా కూడా పెద్ద మార్కెట్‌గా అవతరించింది. దీంతో అడ్డదారుల్లో డేటాను చోరీ చేసి అమ్మే సైబర్ నేరగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా ట్రూకాలర్ డేటా పేరిట ఓ సైబర్ నేరగాడు 4.75కోట్ల మంది భారతీయుల డేటాను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన వారిని ఆన్‌లైన్ ఇంటలిజెన్స్ సంస్థ సైబిల్ గుర్తించింది. ఇందులో స్త్రీ, పురుషుల పేర్లు, వారి ఫోన్ నంబర్స్, వారి లొకేషన్, మొబైల్ నెట్‌వర్క్, ఫేస్ బుక్ ఐడీ, మెయిల్ వంటి వివరాలు అన్నీ ఉండటంతో అధికారులు షాక్ కు గురౌతున్నారు. అలాగే.. 2019 నుంచి యూజర్ డేటాను అతను చోరీ చేసినట్టు తేలింది.

కాగా డేటా చోరీపై ట్రూకాలర్ యాజమాన్యం భిన్నమైన వాదన వినిపిస్తోంది. అది అధికారిక డేటా కాదని, యూజర్స్ డేటా బేస్ తమ వద్ద భద్రంగా ఉందని స్పష్టం చేసింది. ఎవరో వేరే మార్గాల ద్వారా కొంతమంది ఫోన్ నంబర్స్, వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని తెలిపింది. అంతేకాకుండా పలు యాప్స్ నుంచి ఇలా డేటా చోరీ జరిగిందన్న స్టోరీలు గతంలో కూడా వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఓ డార్క్ వెబ్ సైట్ సీక్రెట్‌గా ఈ డేటాను సేకరించి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిందని.. ఒక్కో డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డును రూ.5వేలు/రూ.10వేలు చొప్పున అమ్మేసిందని కూడా వార్తలు వైరల్ గా మారాయి.