సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు తెలివి మీరుతున్నారు.. ఏదో రకంగా జనాలకు ఆశ చూపి.. వారి నుంచి దొరికిన కాడికి దోచేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించండంటూ కొన్ని యాప్‌ల లింకులను పంపి మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ సైబర్ ఠాణాలో ఇలాంటి కేసే ఒకటి నమోదైంది..
పోలీసుల వివరాల మేరకు.. ముషీరాబాద్‌లోని ఆజామాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఫోన్‌కు ఎస్క్యూ.కామ్ అనే యాప్‌కు సంబంధించిన లింక్ వచ్చింది. దీంతో క్లిక్ చేసి చూడగా.. పెట్టే పెట్టుబడికి భారీ లాభాలు వచ్చేలా చేస్తామని ఉంది. దాంతో వ్యాపారి తొలి ప్రయత్నంగా రూ.2 వేలు పెట్టాడు.. సాయంత్రానికే రూ.4 వేలు వచ్చాయి. ఆ తర్వాత రూ.లక్ష పెడితే.. రూ.2.62 లక్షలు అయ్యాయి.
ఈ క్రమంలోనే ఆన్లైన్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతోంది. మరింత పెట్టుబడి పెట్టండని యాప్‌కు సంబంధించిన ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అది నమ్మిన వ్యాపారి విడతల వారీగా రూ.21 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే దానికి రూ.50 లక్షలు లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. అయితే విత్‌డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ కనిపించలేదు. అప్పటివరకు ఫోన్లో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తర్వాత యాప్ కూడా కనిపించకుండా పోయింది.. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.