ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ గండం ముంపు పొంచిఉంది. దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడింది. రాగాల 12 గంటల్లో అండమాన్ సముద్రానికి అల్పపీడనం చేరనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి బలపడి.. డిసెంబర్ 2వ తేదీ కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
డిసెంబర్ 3వ తేదీకల్లా బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరంలో డిసెంబర్ 4వ తేదీన తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా, యానంలో ఎల్లుడి నుంచి తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు.
అదేవిధంగా దక్షిణ కోస్తాలో తెలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒకటి రెండు చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా ప్రస్తుతం ఉన్న అల్పపీడనంతోనే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజా మరో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.