తీరం దాటినా సిక్కోలుకు ఇబ్బందే ?

cyclone

ఉగ్రరూపం దాల్చిన ‘ఫణి’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ప్రస్తుతం తుఫాను ఒడిశా రాష్ట్రంలోని ప్రవేశించింది. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల సమయంలో ఒడిశాలోని గోపాలపూర్‌-చాంద్‌బలీ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 170 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల మేర ఉండొచ్చని చెప్పారు. అలలు 1.5 మీటర్ల ఎత్తుకు మించి ఎగసిపడతాయని తెలిపారు. అంతేకాదు, అదే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో ప్రచండగాలులు, భారీ వర్షాలు తీర ప్రాంతవాసులను వణికిస్తున్నాయి. ఎక్కడ ఏ చెట్టు కూలుతుందో, స్తంభాలు విరిగిపడి విద్యుత్తు తీగలు తెగిపడతాయో.. ఏ ఇల్లు నేలమట్టం అవుతుందోనన్న భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ‘ఫణి’ తుఫాను ఏపీని దాటి ఒడిశాలోకి ప్రవేశించినా శ్రీకాకుళం జిల్లాకు ఇంకా ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను తీరం దాటే పూరీ-చాంద్‌బలీకి శ్రీకాకుళంలోని ఉద్ధానం ప్రాంతం సమీపంగా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వరకు 20 నుంచి 50 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతం, నదులకు సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.