దారుణం: సికింద్రాబాద్ లో సిలిండర్ పేలి… 10 గుడిసెలు దగ్ధం

రోజురోజుకు ఎండ వేడి తీవ్రత అధికమవుతోంది. నిప్పుల సెగలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఈ ఎండల తీవ్రతకు రోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తునే ఉన్నాయి.హైదరాబాద్ లో‌ ఘోరం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ పరిధిలోని బాపూజీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఏరియాలోని ఓ గుడిసెలో సిలిండర్‌ పేలడంతో తీవ్రంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

అయితే ఒక గుడిసెలో సిలిండర్ పేలడంతో ఆ గుడిసెను ఆనుకొని ఉన్న మరో 10 గుడిసెలకు మంటలు వ్యాపించాయి. అయితే ఆ చుట్టుపక్కల గుడిసెల్లోకి కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కట్టుబట్టలతో బయటపడ్డ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.