హైదరాబాద్ ని వదల:శివార్లలో మళ్లీ చిరుత సంచారం…

తెలంగాణలో చిరుతలు పడ్డాయి. హైదరాబాద్ శివార్లలో గత కోన్నిరోజులుగా చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఈ మధ్య హైదరాబాద్ శివార్లలో చిరుత సంచారం చేస్తూ రోడ్లపై విశాలంగా పడుకోవడం, ఆ తర్వతా ఒకరిని గాయపరచడం, ఆ తర్వాత నల్గొండలో నిన్న ఒక చిరుత బోనుకి చిక్కడం వంటివి చూస్తుంటే తెలంగాణలో చిరుత సంచారం గట్టిగానే జరుగుతుంది.

అయితే ఫారెస్ట్ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎండకాలం వేడి, ఆహారం దొరకకపోవడంతో వన్య జీవులు జనారాణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా మరోసారి రాజేంద్రనగర్‌లో చిరుత సంచరించడంపై ఆ ప్రాంతంలో మళ్లీ కలకలం రేగింది. ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. దీంతో గురువారం రాత్రి 8.30గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

కాగా ఈనెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటలు పాటు సంచరించింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఆచూకీ కనుక్కోలేకపోయారు. కాగా ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్కడా గాలించారు. కానీ.. అక్కడా దొరకలేదు.. తాజాగా గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో అధికారులు మళ్లీ అలెర్ట్ అయి ఆ ప్రాంతానికి పరుగులు తీశారు. మరి ఈసారైనా ఆ చిరుతను  పట్టుకుంటారో లేదో చూడాలి.