బోరు చేతిపంపు నుంచి మంటలు.. భయాందోళనలో స్థానికులు…..

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వరుస గ్యాస్ లీకేజీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గత రాత్రి కోనపోతుగుంట గ్రామంలో చేతిపంపు నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు హడలి పోయారు. గ్రామానికి చెందిన ఏసుబాబు ఏడేళ్ల క్రితం ఇంటి పెరట్లో మంచి నీటి కోసం బోరు వేయించాడు. దీంతో ఐదేళ్ల నుంచి నీరు రాకపోవడంతో అలాగే వదిలేసాడు. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి బోరులో నీరు పైకి తన్నుకు రావడం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి పది గంటల సమయంలో బోరుకు చేతిపంపు ఏర్పాటు చేయగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అరగంట పాటు ప్రయత్నించి మంటలను ఆర్పేశారు.

ఆ తర్వాత చేతి పంపులు తొలగించారు. అయితే బోరుకు వేసినా చేతి పంపులు తొలగించినప్పటికీ.. బోరు నుంచి నీరు బయటకు వస్తూనే వుంది. కాగా గ్యాస్ వాసన రావడంతో పోలీసులకు రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారమిచ్చారు. కాగా పాలకొల్లు సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అయితే స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.