కొంప ముంచుతున్న సజ్జల వ్యూహాలు….

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి షాకులు మీద షాకులిస్తోంది. తాజాగా నిమ్మగడ్డ వ్యవహారం మీద ఇచ్చిన తీర్పు వైకాపా నేతలు తలలు పట్టుకునేలా చేస్తోంది. ప్రభుత్వానికి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా జగన్ ను కూడా ఇవాళ్టి తీర్పు డిఫెన్స్ లోకి నెట్టింది. మొదటి నుండి ఇలా ప్రభ్తుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతూ వస్తున్నాయి. కాని తాజాగా నిమ్మగడ్డ వ్యవహారంలో వచ్చిన తీర్పు మాత్రం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రభుత్వ సమర్ధతనే ప్రశ్నిస్తోంది. ఒకవైపు సంక్షేమం విషయంలో, మేనిఫెస్టో విషయంలో వందకు వంద మార్కులు తెచ్చుకుంటున్న జగన్ ప్రభుత్వానికి కోర్టులు పెడుతున్న చీవాట్లతో పాస్ మార్కులు కూడా రాని పరిస్తితిని తెచ్చిపెడుతున్నాయి. అయితే దీనంతటకీ సజ్జల చెత్త సలహాలే కారణమనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా దేశంలో ఏ ప్రభుత్వానికి లేనట్టుగా జగన్ ప్రభుత్వానికి ఏకంగా 16 మంది సలహాదారులున్నారు. కాని వీరి వల్ల జరిగిన ప్రయోజనం ఏదీ కనపడటం లేదు. అటు ప్రభుత్వానికి సలహాదారుగా, ఇటు పార్టీకి ప్రథాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జల మితిమీరిన జోక్యం, అత్యుత్సాహం, అవగాహన లేమి వల్ల అనేక విషయాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దీనికి ఉదాహరణగా భాగంగానే తాజాగా నిమ్మగడ్డ వ్యవహారాన్ని చూపిస్తున్నారు. న్యాయపరమైన వ్యవహారమైనప్పటికీ నేనున్నానంటూ తలదూర్చిన సజ్జల, అటు అధికారులతో సమన్వయ పరచడంలో కాని, ఇటు న్యాయవాదులకు సరైన ఇన్ పుట్స్ ఇవ్వడంలో గాని విఫలం కావడంతో ప్రభుత్వం బొక్క బొర్లా పడింది. దీనిపై జగన్ సీరియస్ అయ్యారని సమాచారం. అసలు అవగాహన లేకుంటే జోక్యం చేసుకోవడమెందుకని ఆయన అన్నట్టు చెప్తున్నారు. ఏదైమైనా ప్రభుత్వ పనితనం మెరుగుపరిచేందుకు పెట్టుకున్న సలహాదారే ప్రభుత్వానికి నష్టం చేసే సలహాలు ఇవ్వడం జగన్ కు తలనొప్పిగా మారింది.