సినీఫక్కీలో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. తల్లి చూస్తుండగానే కూతురిని కిడ్నాప్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన తల్లీకూతురు షాపింగ్ కోసం బయటకు వచ్చారు. ఎంఆర్పీ చౌరస్తా సమీపంలో సాయంత్రం 6 గంటలకు అందరూ చూస్తుండగానే, తల్లి ఎదుటే కూతురిని కిడ్నాప్ చేశారు. ఈ విషయమై ఓ వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించగా జిల్లా అదనపు ఎస్పీ రషీద్ వెంటనే పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
వికారాబాద్ సీఐ గురుకుల రాజశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి కిడ్నాప్‌పై స్థానికులను విచారించారు. అనంతరం సీసీ పుటేజీ ద్వారా కారు గురించి ఆరా తీశారు. కారు హైదరాబాద్ వైపు వెళ్లిన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కిడ్నాప్‌కు గురైన యువతి తల్లిని పోలీసులు ప్రశ్నించగా తమ కూతురికి రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమ వివాహం జరిగిందని, అనంతరం అమ్మాయి ని తమ వద్దే ఉంచుకుంటున్నామని తెలిపిందని సమాచారం. వాళ్లే కిడ్నాప్ చేశారా లేక వేరెవరైనా కిడ్నాప్ చేశారా అనే విషయం తెలియడంలేదని ఆమె పోలీసులతో అన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా.. యువతి ఆచూకీని 24 గంటల్లోపే కనిపెడతామని చెప్పారు.