కుమార్తెను డాక్టర్‌ను చేద్దామని సంకల్పించుకున్న ఆ తల్లి చదువులో ఎంతో ప్రోత్సహించేది. అయితే ఆ కుమార్తె మాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించింది. వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌కు సిద్ధం కావాలని సలహా ఇచ్చిన తల్లిని ఆ బాలిక హతమార్చింది. ఈ ఘటనను కప్పిపుచ్చుతూ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇప్పుడు జువైనల్ హోంలో ఉంది.వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర నేవీ ముంబైలోని ఎయిరోలీ ప్రాంతానికి చెందిన బాలిక(15) ఇటీవలే టెన్త్ పాసైంది.
వైద్య విద్య చదివేందుకు నీట్‌కు సిద్ధం కావాలని తల్లి ఆమె సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. చదువుకోవాలని తల్లి ఎన్నిసార్లు చెప్పినా చిరాకు పడేది. ఈ క్రమంలోనే జూలై 30వ తేదీన ఆ బాలిక రబౌలీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లి చనిపోయిందని ఫిర్యాదు చేసింది. తన మేనమామకు ఫోన్ చేసి ‘అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తీయడం లేదు’ అని చెప్పింది. దీంతో వీరిద్దరి సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది హత్యగా డాక్టర్లు తేల్చడంతో అంతా షాకయ్యారు. దీంతో బాలికను ప్రశ్నించగా అసలు సంగతి బయటపడింది.
తల్లి ఎప్పుడూ చదువు చదువు అని విసిగిస్తోందన్న కోపంతో బాలికే ఆమెను కరాటే బెల్ట్‌తో ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తేల్చారు. నేరాన్ని దాచిపెట్టేందుకు మేనమామతో ఆత్మహత్యగా పేర్కొంది. హత్య విషయం బయటపడటంతో పోలీసులు బాలికను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.అయితే ఆరు నెలల క్రితం తన తల్లి వేధిస్తోందంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు ఆ బాలిక ఏకంగా తల్లినే హతమార్చిందని తెలుసుకుని పోలీసులు షాకవుతున్నారు. ఇంత చిన్న వయసులో హత్య చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆడిన నాటకం సైతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.