Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎన్నో ఏళ్ల నుంచి పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడు. పాక్ అంగీకరించకపోయినా ప్రపంచమంతటికీ ఈ విషయం తెలుసు. ప్రభుత్వ అతిథిగా పాకిస్థాన్ లో రాచమర్యాదలు అందుకుంటున్న దావూద్ ఇబ్రహీం అక్కడ ఉంటూనే భారత్ లో చీకటి సామ్రాజ్యాన్నిఏలుతున్నాడు. మనదేశంలో అండర్ వరల్డ్ కార్యకాలపాలన్నీ ఇప్పటికీ దావూద్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. భారత్ లోనే కాదు…దాదాపు 16 దేశాల్లో దావూద్ దందా నడుస్తున్నట్టు ఇంటర్ పోల్ సమాచారం.
దావూద్ బాలీవుడ్ నిర్మాతల నుంచి డబ్బు దోచుకుని బిలియన్ డాలర్ల విలువైన పైరసీని నడుపుతున్నట్టు ఇంటర్ పోల్ గతంలోనే ప్రకటించింది. 25 ఏళ్ల నుంచి భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఉన్నా..దావూద్ అక్రమ సంపాదనకు ఎక్కడా అడ్డుకట్టపడలేదు. దీనికి నిదర్శనం ప్రముఖ అమెరికన్ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ వెల్లడించిన తాజా సమాచారమే. ఫోర్బ్స్ వివరాల ప్రకారం…
ప్రపంచంలో సంపన్న నేరగాళ్లలో దావూద్ రెండోస్థానంలో ఉన్నాడు. 2015 నాటికి దావూద్ కు 6.7 బిలియన్ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయని ఫోర్బ్స వెల్లడించింది. దావూద్ ఆచూకీ చెప్పినవారికి ప్రకటించిన రివార్డుల మొత్తం 25 మిలియన్ డాలర్లని తెలిపింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం దావూద్ ఇబ్రహీం ఆస్తులను జప్తుచేసిన నేపథ్యంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నేరస్థుడు కొకైన్ కింగ్ గా పిలిచే పాబ్లో ఎస్కోబార్. కొలంబియా మాఫియా డాన్ అయిన పాబ్లో ఎస్కోబార్ కు 1990 నాటికే 30 బిలియన్ డాలర్ల విలువైన సంపద ఉందని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాలో ఉపయోగించే డ్రగ్స్ లో 80 శాతం ఎస్కోబార్ సరఫరా చేస్తాడు.
మరిన్ని వార్తలు: