నుజ్జు నుజ్జైన డీసీఎం వాహనం.. ఇద్దరు మృతి…

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే… వెనుక నుంచి వెళ్తున్న డీసీఎం వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డ్రైవర్ సహా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు.

కాగా డీసీఎం లారీ హైదరాబాద్ నుంచి కడప జిల్లా రైల్వే కోడూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే డీసీఎం క్యాబిన్ నుజ్జునుజ్జై డ్రైవర్, మరో వ్యక్తి నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులది కడప జిల్లా రైల్వే కోడూరుగా పోలీసులు గుర్తించారు.

లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అత్యవసర వస్తువుల వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి అంతగా రాకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురవతున్నారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.