నెల రోజుల కిందట కనిపించకుండాపోయిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను వ్యవసాయ క్షేత్రాల్లో గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఐదుగుర్ని ఉరేసి హత్యచేసిన దుండగులు.. 10 అడుగుల లోతైన గుంతలో పాతిపెట్టారు. జేసీబీ సాయంతో గుంతను తవ్వి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. దేవాస్‌కు చెందిన మమతా (45), ఆమె ఇద్దరు కుమార్తెలు రూపాలీ (21), దివ్య (14), మరో ఇద్దరు బాలికలు మే 13 నుంచి కనిపించకుండాపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మమతా కుమార్తె రూపాలీ, అదే గ్రామానికి చెందిన సురేంద్ర చౌహన్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, మరో యువతితో పెళ్లికి సురేంద్ర సిద్ధంకావడంతో రూపాలీకి ఈ విషయం తెలిసిందే. దీంతో సురేంద్ర ఫోటో, మొబైల్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన రూపాలీ.. ఆయన తనకు కాబోయే భర్త అంటూ పరిచయం చేసింది. ఇది నచ్చని సురేంద్ర చౌహన్.. ఆమెపై ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆమెను ఎలాగైనా వదలించుకోవాలని పథకం వేశాడు.
రూపాలీ కుటుంబాన్ని హత్యచేసి వేర్వేరు ఊరి బయట పొలాల్లో గుంతలు తీసి పాతిపెట్టారు. మృతదేహాలపై దుస్తులు తొలగించి వాటిని కాల్చివేశారు. దుర్వాసన రాకుండా ఉండటానికి వాటిపై ఉప్పు, యూరియా వేసి పూడ్చివేశారు. మే 13 నుంచి మమతా ఆమె కుమార్తెలు, ఇద్దరు బాలికలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. వారి కోసం దర్యాప్తు చేపట్టారు.
బాధితుల్లో ఒకరితో సంబంధం పెట్టుకున్న భూస్వామి.. అతడి సహచరులు ఈ భయానక ఘటన వెనుక ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సురేంద్ర రాజ్‌పుత్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు.‘‘ఈ హత్యలకు సురేంద్ర చౌహన్ పథకం వేసి, అమలుచేశాడు.. మిగతా ఐదుగురు బాధితులను పూడ్చిపెట్టడానికి గుంతులు తీశారు’’అని దేవాస్ పోలీస్ అధికారి శివ్ దయాల్ సింగ్ తెలిపారు. బాధితులు అదృశ్యమైన తర్వాత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో వారి ఆచూకీ కోసం గాలిస్తుంటే.. రూపాలీ ఫేస్‌బుక్ ఐడీ ద్వారానిందితులు తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారన్నారు.
తన ఇష్టప్రకారం పెళ్లిచేసుకున్నానని, అమ్మ, సోదరి, ఇద్దరు కజిన్ సిస్టర్స్ తన వద్దే సురక్షితంగా ఉన్నానంటూ రూపాలీ ఐడీతో పోస్ట్‌లు పెట్టారు. అయితే, రూపాలీ మొబైల్ ఫోన్ నిందితులను పట్టించింది. ఆమె మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా.. తరుచూ తన ఇంటి యజమానితో మాట్లాడినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తనకేం సంబంధం లేదని బుకాయించాడు. అతడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. మే 13న మరో ఐదుగురితో టచ్‌లో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఐదుగురిని వేర్వేరుగా ప్రశ్నించడంతో హత్యచేసి మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు చెప్పారు.