బల్లిపడిన ఆహారం తిని 80 మంది విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పాఠశాల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షం కావడం హావేరి జిల్లాలో కలకలం రేగింది. వెంకటాపురం తండా ప్రభుత్వ పాఠశాలలో బల్లి కలిసిన భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం హుటాహుటీన రాణిబెన్నూర్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.
నిర్లక్ష్యం కారణంగానే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని, ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించారు. చికిత్స అనంతరం చిన్నారులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ పలు చోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కుళ్లిపోయిన కోడి గుడ్లు పంపిణీ చేయగా.. అందులో నుంచి పురుగులు బయటపడ్డాయి.
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లను పంపిణీ చేశారు. అందులో పురుగులు వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ బల్లియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న ఐదేళ్ల చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. పాఠశాలలో కిచిడీ తిన్న వెంటనే చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనకు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమని తేల్చిన అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.