యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి

అసలే కరోనా వైరస్ మహమ్మారి కాలం.. అందులోనూ లాక్ డౌన్ విధింపు.. వలస కార్మికులకు చాలా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దేశంలో వలసకార్మికుల బతుకులు రోడ్డుపైనే తెల్లారుతున్నాయనడానికి ఉత్తరప్రదేశ్ లో ఈరోజు తెల్లవారుజామున జరిగినదుర్ఘటనే నిదర్శనం. ఇంటికి చేరనేలేదు మద్యలోనే జీవితాలు ముగిసిపోయాయి.

ముంభై రైలు ప్రమాదం ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం యూపీలో చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలతో రాజస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెలుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరాయ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.