ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్‌ తుదిశ్వాస విడిచారు. ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్‌ ఆడారు. తన క్రికెట్‌ కెరీర్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు.

1984-1992 మధ్య కాలంలో ఆసీస్‌ తరఫున క్రికెట్‌ ఆడారు జోన్స్‌. టెస్టు క్రికెట్‌లో 3,631 పరుగుల్ని జోన్స్‌ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉ‍న్నాయి. టెస్టు కెరీర్‌లో రెండు డబుల్‌ సెంచరీలు జోన్స్‌ సాధించాడు. ఇక వన్డే కెరీర్‌లో 7 సెంచరీలు, 46 హాఫ్‌ సెంచరీల సాయంతో 6,068 పరుగులు సాధించారు. వన్డేల్లో జోన్స్‌ సగటు 44. 61గా ఉంది. 1986లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్‌ డబుల్‌ సెంచరీ సాధించారు. ఆ టెస్టు టైగా ముగిసింది. జోన్స్‌ వీరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్‌ ఓడిపోయే టెస్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. జోన్స్‌ తన ఫస్టక్లాస్‌ కెరీర్‌లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. ఆయన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 324 నాటౌట్‌.