వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దీపక్ హుడా భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన అరంగేట్రంపై దీపక్ హుడా స్పందించాడు. విరాట్ కోహ్లి లేదా ఎంస్ ధోని చేతుల మీదగా తొలి వన్డే క్యాప్‌ను పొందాలనేది తన కల అని హుడా వెల్లడించాడు. ‘నేను వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ తరుపున అరంగేట్రం చేశాను, అది నాకు అద్భుతమైన అనుభూతి. నా శక్తికి మించి జట్టు కోసం పనిచేస్తాను. మ్యాచ్‌కు ముందు ఇదే విషయం నేను సూర్యకుమార్ యాదవ్‌కి చెప్పాను.
భారత తరుపున ఆడాలి అనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల. ఈ మ్యాచ్‌లో కోహ్లి నుంచి క్యాప్ అందుకోవడం మధుర అనుభూతిని కలిగించింది. నా కల ఇప్పుడు నేరవేరింది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రయాణంలో నన్ను వెనుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని దీపక్ హుడా ట్వీట్ చేశారు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 26 పరుగులు చేశాడు. అదే విధంగా రెండో వన్డేలో కూడా 29 పరుగులతో హుడా రాణించాడు.