మంచిర్యాల జిల్లాలో అమ్ముతున్న కుళ్లిపోయిన మాంసం

మంచిర్యాల జిల్లాలో అమ్ముతున్న కుళ్లిపోయిన మాంసం

మంచిర్యాల జిల్లాలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. వేడివేడిగా అందించే ఆహారపదార్థాల వెనుక కుళ్లిపోయిన మాంసం.. ఇతర ఆహార పదార్థాలు పెడుతున్నారు. ఈ విషయం గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో వెలుగుచూసింది.దుర్వాసన, కుళ్లిన ఆహార పదార్థాలు, పాడైన కూరలు, అపరిశుభ్రంగా నిల్వఉంచిన ఆహార పదార్థాలను ప్రజలకు పెడుతున్నట్లు గుర్తించారు. పాడైన చికెన్‌ లెగ్‌పీస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఇందు బార్‌అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లిన అధికారులకు అపరిశుభ్రత, పాడైన చికెన్‌లెగ్‌ పీసులు కనిపించాయి. దీంతో ఆ యజమానికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. అక్కడినుంచి అభిజిత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడా అపరిశుభ్రతతోపాటు, ప్లాస్టిక్‌ కవర్లు లభించాయి. ఆ యజమానికి రూ.2వేల జరిమానా విధించారు.

జిల్లాలో రెగ్యులర్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ లేడు. ఆహార పదార్థాల అమ్మకాలు, కల్తీ వ్యాపారంపై కనీసం ఒక్క కేసు నమోదు కాలేదు. గతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జిల్లాకేంద్రంలో తనిఖీలు చేసి జరిమానా విధించారు. అప్పుడు పది హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి రూ.5వేల చొప్పున ఒక్కో హోటల్‌కు జరిమానా విధించారు. కుళ్లిన ఆహారపదార్థాలను నిల్వ ఉంచితే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది కేవలం జరిమానాకే పరిమితం అవడంతోనే నిర్వాహకులు తనిఖీలకు భయపడడం లేదు. కానీ.. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌కు కనీసం కార్యాలయం కూడా లేదు. మున్సిపల్‌ కార్యాలయంలోనే ఓ మూలన టేబుల్‌ కేటాయించారు. ఎక్కడ కల్తీ జరిగినా కనీసం ఆ కల్తీ జరిగిందో లేదోనన్న విషయంపై ఇక్కడ పరిశీలించేందుకు ల్యాబ్‌ సౌకర్యం కూడా లేదు.