ఎన్‌సీబీ ఎదుట దీపికా పదుకొనే

ఎన్‌సీబీ ఎదుట దీపికా పదుకొనే

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొనే ఎన్‌సీబీ ఎదుట శనివారం విచారణకు హాజరైంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా శుక్రవారం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎన్‌సీబీ ఎదుట హాజరవ్వగా.. శనివారం దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్‌, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నారు. ముంబై కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు ఈ ఉదయం దీపికా పదుకొనే వచ్చారు. అక్కడే ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది.

అయితే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారించనున్నారు. కాగా.. శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ను ఈ రోజు మరోసారి పిలిచే అవకాశం ఉంది. కరిష్మా ప్రకాష్‌ను శుక్రవారం సుమారు నాలుగు గంటలపాటు ఎన్‌సీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో ఆమె కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

తాజాగా కరణ్‌ జోహార్‌ సహాయకులు క్షితిజ్‌ ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్‌సీబీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధంలేదని శనివారం కరణ్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్న వార్తలను ఖండించారు. అనుభవ్‌ చోప్రా 2011-2013 మధ్య తమ సంస్థతో రెండు ప్రాజెక్టులలో పనిచేసినప్పటికీ ధర్మ ప్రొడక్షన్‌లో ఉద్యోగి మాత్రం కాదని కరణ్‌ తెలిపారు. మరో వ్యక్తి క్షితిజ్‌ రవి ప్రసాద్‌ ధర్మ ప్రొడక్షన్‌తో అనుసంధానించబడిన ఒక సంస్థలో 2019 నవంబర్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన చేరారు.

అయితే ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు మా ప్రొడక్షన్‌ బాధ్యత వహించలేదు. ఈ వ్యక్తులు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఈ ఆరోపనలకు ధర్మ ప్రొడక్షన్స్‌కు సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. నేను డ్రగ్స్‌ తీసుకోను.. వాటి వినియోగాన్ని కూడా నేను ప్రోత్సహించను అని మరోసారి చెప్పాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.