ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అతిషికి బుధవారం నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా వెల్లడైంది. ఢిల్లీలోని కల్కాజీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అతిషిని హోం క్వారంటైన్లో ఉంచి కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన అతిషి త్వరగా కోలుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కరోనాపై పోరులో కీలక పాత్ర పోషించిన అతిషి సత్వరమే కోలుకుని తిరిగి ప్రజలకు సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరుసటిరోజే అతిషికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇక సత్యేందర్ జైన్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలు ఎదురవడంతో ప్రస్తుతం ఆయన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.