దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎల్.జీ అనిల్ బైజల్ను కలిసిన తర్వాత మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మే 31 నుంచి వ్యాపారాలకు సడలింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి ఒక వారం పాటు నగరంలో పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ వాటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిపుణులు, ప్రజల అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ప్రతి వారం అన్లాక్ ప్రక్రియను కొనసాగిస్తుందని అన్నారు.